Loading...

అసూయను వీడండి, దేవుని దీవెనలు పొందండి!

Sharon Dhinakaran
09 Dec
నా ప్రియమైనవారలారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీకు దేవుడు మంచి స్వభావమును అనుగ్రహించాలని వాంఛతో ఉన్నాడు. సాధారణంగా, మంచి, చెడు అనునది మనకందరికి తెలిసిన ఒక కార్యమే. మంచి కార్యములనునది, ' సమాధానము, శాంతి, ప్రేమ, దయాళుత్వము' మొదలగునవి. చెడు అనునది, 'అబద్దము, అసూయ, పగ, ద్వేషము, ఈర్ష్య ' ఇటువంటి వాటితో నిండియుంటుంది. ఇటువంటి లక్షణములు చెడు స్వభావమునకు మనలను మార్చివేస్తుంది. మీరు ఎప్పుడైన, అసూయ అను స్వభావమును గూర్చి ఆలోచించియుంటారా? మీలో అసూయ ఉన్నట్లు మీరు గుర్తించియున్నారా? దీనిని మనము అవగాహన చేసుకోలేని ఒక స్వభావము. దీనికి పేరే అసూయ. బైబిల్‌లో అనేక చోట్ల అసూయను గూర్చి మనము చదువుచున్నాము. ఆధ్యాత్మిక జీవితములో ఎప్పుడు కూడ మన యొక్క మనో నేత్రములు తెరువబడియుండాలి. ఎందుకంటే, ఈ అసూయ అను స్వభావము మనలోనికి ప్రవేశించకుండా ఉండుటకే. " ఒకరి నొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు ఉందము'' (గలతీయులకు 5:26) అని వాక్యము మనకు తెలియజేయుచున్నది. 

నాప్రియులారా, పాపము, శోధనలు మనలోనికి ప్రవేశించుటకు అపవాది అసూయను ఒక సాధనముగా మన మీద ఉపయోగిస్తుంది. అది ఎంతో సుళువుగా మన హృదయములోనికి చొచ్చుకొని వెళ్లి, మన యొక్క సమాధానమును, ఆశీర్వాదకరమైన జీవితమును నాశనము చేయును. అసూయ ఒక్కొక్క మెట్టుగా మీ జీవితములోనికి చోటుచేసుకొని, చివరికి ఒక రోజు మీ జీవితమును నిర్మూలము చేస్తుంది. ఉద్యోగము స్థలములో మీ ప్రక్కన వారికి ప్రమోషన్ వచ్చినట్లయితే, నాకు ఈ ఆశీర్వాదము లేదని అసూయ చెందుతారు. అయితే, దేవుడు మనకనుగ్రహించిన దానితో మనము సంతృప్తి చెందినట్లయితే, దేవుడు మనలను ఉన్నత స్థితికి హెచ్చించి ఆశీర్వదిస్తాడు. రెండవదిగా, దుర్మార్గుల జీవితాలను చూచి, మనము అసూయ చెందుతాము. వారు చెడు మార్గములలో వెళ్లుచూ, సంపాదించుకొని ఉన్నత స్థానములో ఉన్నప్పుడు, వారిని చూచి, ' నేను నీతిగా జీవించి ప్రయోజనమేమి లేదు అని తలంచెదము.' ఇది కూడ ఒక విధమైన అసూయకు చెందిన స్వభావము. " అయితే, చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము'' (కీర్తనలు 37:1) అని బైబిల్ తెలియజేయుచున్నది. కాబట్టి, మీరు అసూయను వీడండి, దీవెనలను పొందండి. 
మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు, ఈ అసూయ కారణము చేతనే, తాను సిలువలో వ్రేలాడదీయ్యబడెను. ఈ అసూయ దీనికి కారణము. యేసుక్రీస్తు అనేక చోట్లకు వెళ్లి, అద్భుత కార్యములు, సూచక క్రియలను జరిగించి, ప్రజల మధ్యలో పేరుగాంచెను. ఆయన యొక్క మంచి కార్యములు, నీతి గల స్వభావమును ప్రధాన యాజకులు ఇష్టపడలేదు. వాటిని చూచి, యేసుక్రీస్తు మీద వారు అసూయ చెందారు. కావుననే, ఆయన సిలువలో వ్రేలాడదీయబడాలని ఉద్దేశము కలిగియుండిరి. యేసు ఉత్తముడు, ఆయన సిలువలో వ్రేలాడదీయుటకు అర్హుడుకాడని పిలాతు గుర్తెరిగెను. " ప్రధానయాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలిసికొని నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా? అని అడిగెను'' (మార్కు 15:9) అని బైబిల్‌లో మనము చదువుచున్నాము. అయినను, ప్రధానయాజకులు, శాస్త్రులు వివాదములు రేపి, ఆయనను సిలువకు అప్పగించుటకు పిలాతును సమ్మతింపజేశారు. 

నా ప్రియమైనవారలారా, అసూయ, అను సాధనము అపవాది ఏ విధముగా, ఉపయోగిస్తాడని చూడండి. మనము ఇతరులను చూచి అసూయ చెందినప్పుడు, మన యొక్క ఆశీర్వాదములను పోగొట్టుకొనే స్థితిని మనకు దిగజారిపోతాము. బైబిల్‌లో మోషేను చూచినట్లయితే, దేవునితో ముఖాముఖిగా మాట్లాడెనని మనము చదువుచున్నాము. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. తద్వారా, మిర్యాము అసూయ చెంది, " మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు మోషేచేత మాత్రమే యెహోవా పలికించెనా? ఆయన మా చేతను పలికింపలేదా? అని చె ప్పుకొనగా '' (సంఖ్యాకాండము 12:2). యెహోవా ఆ మాట వినెను. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్లిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్త బడెను; అప్పుడు మిర్యాము హిమమువంటి తెల్లని కుష్ఠు గలదాయెను; అహరోను మిర్యామువైపు చూచినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా కనబడెను. మోషే యెలుగెత్తి ' దేవా, దయచేసి యామెను బాగుచేయుమని' యెహోవాకు మొఱపెట్టుట చేత ఆమె స్వస్థపడెనని మనము బైబిల్ చూడగలము. 

నా ప్రియ సోదరీ, సోదరులారా, నేడు ఇటువంటి స్వభావమును కలిగియున్నారా? అని మిమ్మును మీరు ఒక సారి పరీక్షంచుకొనండి. అసూయ ద్వారా మనకు దేవుడు ఉంచిన ఆశీర్వాదములను పోగొట్టుకొంటాము. నేటికిని ఈ సందేశమును చదువుచున్న మీ హృదయములో అసూయ స్వభావము ఉన్నట్లయితే, వాటన్నిటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుడు మీకొరకు దాచియుంచిన ఆశీర్వాదమును పొందుకొనండి. దేవుడు మిమ్మును దీవించును గాక.
Prayer:
ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రీ, 

నీ పాదములకు స్తుతులు చెల్లించుచున్నాము. దేవా, నీ యొక్క మంచి స్వభామును మాకు దయచేయుము. అపవాది గర్జించు సింహము వలె ఉన్నప్పటికిని నీ కృపను మా చుట్టు ఆవరించియుండునట్లు మాకు సహాయము దయచేయుము. ఎన్నటికి అసూయ అను చెడు స్వభావము మాలోనికి ప్రవేశింపక మా హృదయమును కనికరముతో నింపుము. దయ, శాంతి, ప్రేమ, సమాధానము అను మంచి గుణములను మాకు అనుగ్రహించుము. ఇతరుల పట్ల మేముప్రేమ కలిగియుండుటకు నీ యొక్క దైవీకమైన ప్రేమను మాకు అనుగ్రహించుము. అసూయ స్వభావము ద్వారా మాకు నీవిచ్చిన ఆశీర్వాదములను పోగొట్టుకొనకుండా ఉండునట్లు మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రీ, ఆమేన్. 

1800 425 7755 / 044-33 999 000